Thursday, February 22, 2018

నాకర్థమయిన దిగంబరతత్వం

దిగంబరుడు అంటే శివుడు. సామాన్యంలో దిగంబరుడంటే వస్త్రాలు ధరించనివాడు అని అంటుంటారు. కానీ దిగంబరుడనే పద అర్థం ప్రకారం శివుడు వస్త్రధారుడే..ఎలా

అసలు అంబరము అంటే ఆవరించి వుండేది లేదా కప్పి వుంచునది అని అర్థం. భూమిని ఆవరించి ఉండేది కాబట్టి అంబరమంటే ఆకాశమనీ, శరీరాన్ని కప్పి ఉంచేది కాబట్టి అంబరమంటే వస్త్రమనీ అర్థాలున్నై. ఈ లెక్కన దిగంబరుడంటే దిక్కులను అంబరముగా అంటే వస్త్రముగా కలిగిన వాడు అని అర్థము. మనకి నారతోనూ, దారంతోనూ తయారైనవి వస్త్రాలైతే శివుడికి దిక్కులే వస్త్రాలన్నమాట.

ముందు దిక్కులంటే ఏమిటి - తూర్పు (East), ఆగ్నేయం (South-East), దక్షిణం (South), నైఋతి (South-West), పడమర (West) వాయువ్యం (North-West), ఉత్తరం (North), ఈశాన్యం (North-East) అనే ఎనిమిదీ ...ఇవి భూమికి సమాంతరంగా ఉండేవి. ఇవి కాకుండా ఊర్థ్వ దిశ (ఆకాశం), అధోదిశ(భూమి) అనే మరో రెండు దిశలతో కలిపి మొత్తం పది. మనం భూమ్మీద నిలబడి నప్పుడు మనకు మామూలుగా కనపడే దిక్కులు ఇవీ.

ఇప్పుడు ఉదాహరణకి మనం తూర్పుకి అభిముఖంగా నిలబడి తూర్పువైపు దేన్నైనా పంపించామనుకోండి.....అది భూమికి సమాంతరంగా ప్రయాణిస్తూంటే చివరికి ఎక్కడికి చేరుతుంది... భూమి గుండ్రంగా వుంది కాబట్టి అది పడమర వైపు నుంచీ మళ్ళీ మన దగ్గరకే వస్తుంది. మరి ఈలెక్కన తూర్పేది? పడమర ఏది? (వాస్తుశాస్త్ర ప్రకారం దిక్కుల లెక్క వేరే. అది భౌతికవాద లౌకిక జీవన విధానానికి, వాతావరణ ప్రభావానుసారం చూడవలసినది. ఈ సందర్భంలో అది అప్రస్తుతం) అలాగే ఊర్థ్వ అధో దిశలను మినహాయించి మిగిలిన దిక్కులన్నీ కూడా. ఈ ఎనిమిదీ మన దగ్గరే మొదలై మరో దిశగా మనదగ్గరే అంతమౌతాయి.

ఇక మిగిలినవి ఊర్థ్వ అధో దిశలు. ఊర్థ్వదిశ మనతో మొదలై వాతావరణాన్ని దాటి ఆకాశాన్ని దాటి విశ్వాంతరాల్లో అనంతంగా సాగిపోతూ వుంటుంది. అలాగే అథోదిశ కూడా మనతో మొదలై భూమి లోపలివైపు సాగిపోతుంది. భూమి గోళాకారం కాబట్టి అథో దిశ కూడా భూగోళాన్ని దాటి విశ్వాంతరాల్లోకే సాగుతుంది. అప్పుడు తూర్పు మొదలైన ఎనిమిది దిశలూ మిగిలిన దిశలైన ఈ ఊర్థ్వ అధో దిశల్లోని భాగాలే అవుతాయి. ఇక్కడ మన సౌలభ్యం కోసం విశ్వానికి అంతం ఉందనుకుందాం. అప్పుడు విశ్వానికి చివర ఉన్నదే దిక్కు అవుతుంది.

ఇప్పుడు మళ్ళీ మనం వస్త్రరూపమేంటో చూద్దాం. వస్త్రమంటే శరీరపు అంచులను ఆవరించి ఉండేదికదా! అంటే వస్త్రంలోపల ఉండేదే కదా మన శరీరం. మరి ఇదే భావాన్ని శివుడికి అన్వయిస్తే దిక్కులే ఆయనకు వస్త్రం అన్నాం కాబట్టి దిక్కుల లోపల ఉండేదే ఆయన శరీరం. పైన వివరించిన ప్రకారం దిక్కులలోపల ఉండేది ఈ అనంత విశ్వం కాబట్టి విశ్వమంతా శివుడి శరీరంగా భావించాలి.

దీన్నిబట్టి మనమేం అర్థం చేసుకోవాలి?
శివుడు అంటే ఈ విశ్వమే. భూమి, చంద్రుడు, సూర్యుడూ, గ్రహాలు, నక్షత్రాలు, పంచభూతాలు, శూన్యం అంతా శివమే. ఈ విశ్వంలో భాగమైన మనమూ శివమే. శివం అంటే ఆనందమే. 

అంతులేని ఆనందమే జీవిత పరమార్థం.
Eternal happiness is meaning of life.

- విట్టుబాబు
27/11/2017

Sunday, February 4, 2018


మనిషితత్వం!

మనిషి మనిషికో మనసూ తత్వం
మనసు మనసుకో మాయా మర్మం
తనకో నీతి తనకో న్యాయం
తనదైతేనే దానం ధర్మం
తరవాతంతా వ్యర్ధమనర్ధం
స్వార్ధం కాదా తన పరమార్ధం
నేనూ నాదనె భావమె భోగం
అంతా నాదనె తనదో రోగం
అర్ధంపర్ధం లేనిదె గమ్యం
నడకో పరుగో తెలియదు దూరం
నలుగురితోనూ నడవని కష్టం
గెలుపే కాదది నీకే నష్టం
బతకడమంటే కాదిది నేస్తం
బతికించడమే గద కర్తవ్యం
నలుగురి కోసం నడిచే గమనం
నీదైనప్పుడె గొప్పది పయనం
విట్టుబాబు
04.02.2018


నేనూ ఆమె 2

ఆమె చేరువౌతోందనగానే ఏదో ఆనందం
ఎప్పుడెప్పుడు ఆమె వొళ్ళో వాలదామా అనే ఆరాటం
పోద్దున్న లేచిందగ్గర్నుంచీ
ఏంటో వెధవ హడావుడి
ఒకటే ఉరుకులూ పరుగులూ
ఏం పొందాలనో
కోరికలూ ఆశలూ బరువులూ బాధ్యతలూ
అసంతృప్తులూ నిరాశలూ బంధనాలూ నిస్పృహలూ
ఎన్ననీ...
ఇన్నింటి మధ్య కొట్టుమిట్టాడుతున్నా
సాయంత్రమౌతోందంటే చాలు
ఉత్సాహం పొంగుతుంది
ఇక ఆమె వస్తుందనీ!
ఆమె చేరువౌతోందనగానే ఏదో ఆనందం
ఎప్పుడెప్పుడు ఆమె వొళ్ళో వాలదామా అనే ఆరాటం
ముందు మెల్లగా పలకరిస్తుంది
సేద తీరేదాకా ఊసులాడుతుంది
కడుపు నిండాకా ప్రేమగా జోకొడుతుంది
మళ్ళీ తెల్లారేదాకా రమిస్తూ
మళ్ళీ మర్నాటి పోరాటానికి కావలసినంత శక్తినిస్తుంది
నిశ - యామిని - రాతిరి
అన్నీ ఆమె పేర్లే!!
విట్టుబాబు
22.01.2018

Sunday, December 31, 2017

నేనూ ఆమె

ఆమె సమక్షంలో
నేను లుప్తమైపోయి తానై మిగులుతాను
జీవన పోరాటంలోని జయాపజయాలు
ఒత్తిడులు చిరాకులు
మనోఫలకంపైన జ్ఞాపకాలన్నీ
ఆక్షణాన మాయమైపోతాయి
నేనెవరో ఏఁవిటో మరచిపోయి
తనలోనే ప్రవేశించి
అణువణువూ గాలించి
నన్ను నేను వెతుక్కునే ప్రయత్నం చేస్తాను
ఆ మైమరపులో
నన్ను నేను కొత్తగా సాక్షాత్కరింపజేసుకుంటాను
ఇంతకీ ఆమె ఎవరో తెలుసా
శరత్తునీ హేమంతాన్నీ
శిశిరాన్నీ వసంతాన్నీ
తనలోనే యిముడ్చుకున్న
ప్రకృతి కాంత!!

విట్టుబాబు
31/12/2017

Sunday, December 24, 2017

నేను మనిషిని!
అన్నిభాషలూ నావే
అన్ని యాసలూ నావే
అన్ని ప్రాంతాలూ నావే
నాకు కులం లేదు నాకు మతం లేదు
నేను కానిదేదీ లేదు
నేను నీ మనిషిని!!
మానవత్వానికి నేను మిత్రుణ్ణీ
రాక్షసత్వానికి శతృవుని
పసిపిల్లల చిరునవ్వుని నేను
అసమానత్వం అసలెరుగని వాణ్ణి
అసహనమా...వుంది
మనుషుల మధ్య గోడలు కట్టేవాళ్ళపై
అన్యాయాలు చేసేవాళ్ళపై
అమాయకులను దోచుకునేవాళ్ళపై
అబలలపై అత్యాచారాలు చేసేవాళ్ళపై
ప్రకృతిలోని సహజత్వాన్ని తుంచేవాళ్ళపై
అమితమైన ప్రేమా వుంది
మనిషులుగా బతికేవాళ్ళపై
స్వచ్ఛమైన మనసులపై
ఎందుకంటే
నేను ప్రపంచం మనిషిని!!!
బయటకు వెళ్ళేటప్పుడు "ఎక్కడకి" అని అడగకూడదని అంటారు. ఎందుకు?
ఏమైనా కారణముందా లేక మూఢనమ్మకమా?
                        ********

ఎవరైనా ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరేటప్పుడు ఆ పని మీద ఓ ఉత్సాహంతో, ఓ అంచనాతో, ఓ నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో ఉంటారు. అప్పటికే వారికి దానికి సంబంధించిన ఓ అవగాహన ఏర్పరుచుకొనే వుంటారు.

ఇప్పుడు మనం ఇలాగే ఓ ముఖ్యమైన పని మీద బయలుదేరాం.. ఎవరో మనలను ఎక్కడికి అని అడుగుతారు. అడిగాక చెప్పాలి కదా! చెప్తాం.
అప్పుడు వాళ్ళేం చేస్తారు?
ఊరికే సరే అనరు కదా..... అడిగిన వాళ్ళు సరే నాయనా మంచిది జయోస్తు అన్నారనుకోండి...ఏ సమస్యా లేదు. మరింత ఉత్సాహంతో వేళ్తాం. కానీ మనబుద్ధి గురించి మనకి తెలుసుగా సలహాలివ్వకపోతే తోచదు.....

ఇప్పుడూ ఆ పని ఇలా చెయ్యొచ్చు కదా.....ఇప్పుడెందుకూ ఆ పని చెయ్యడం.....నువ్వూ వాడిని కలవకు, వీడిని కలువు.....ఇప్పుడు అవసరమా.....అక్కడికెళ్ళకు, ఇక్కడికెళ్ళు ఇలా రకరకాల సలహాలివ్వడమో...లేదా మరే విషయమో చర్చకు పెట్టడమో..చేస్తారు.

అప్పుడేమవుతుంది, మనం గందరగోళంలో పడతాం ఏం చెయ్యాలా అని...మనం అనుకున్నది చెయ్యాలా,వాళ్ళు చెప్పింది చెయ్యాలా ఎంతకీ తేలదు.
ఆ సలహాలు మనకి నచ్చలేదనుకోండి, చిరాగ్గా వుంటాం. లేదా తప్పనిసరై పాటించాల్సొచ్చిందనుకోండి మనస్పూర్తిగా చెయ్యం.
ఒకవేళ మరేదో విషయం కెలికారనుకోండి, వెళ్ళే పనిమీద లగ్నమవ్వాల్సిన మనసు మరేదో ఆలోచిస్తుంది.

చివరకు ఏమవుతుంది...మనం శతవిధం ఏకాగ్రతతో ఆపని చెయ్యలేక పోతాం...అంటే అపజయానికి అవకాశం వుందనమాట! ఏ పనైనా తదేక ఏకాగ్రతతో మనసు లగ్నం చేస్తే జయం కలుగుతుంది.

అందుకని ఎక్కడికీ అని అడగకపోతే ఈ సోదంతా వుండదుకదా... మామూలుగా బయటికెళ్ళినప్పుడు ఏ గొడవా లేదు, ఏఁవైనా అడగొచ్చు. కానీ మనకి  అలవాటవ్వాలిగా అందుకనీ ఎవరు ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏమీ అడగడం లేదనుకోండి, అది అలవాటుగా మారి ఎవ్వరి పనీ చెడగొట్టకుండా వుంటాం.
మరి మనమేవనుకుంటాం...వెళ్తున్నప్పుడు చెప్పెళ్ళొచ్చుగా, వాడి సొమ్మేంపోయిందీ అని....కానీ మనకి చెప్పాల్సిన విషయమే ఐతే చెప్పే వెళ్తారుగా....మనకి చెప్పాల్సిన అవసరం లేనప్పుడు తెలుసుకొని మన బుర్రెందుకు పాడుచేసుకోవడం...మనకున్న బాధలు చాలవనా!!

ఎవరైనా వారికి తెలిసిన దారిలో సులువుగా గమ్యం చేరుకుంటారు. ఎవరో చెప్పారని దారి మారిస్తే అంతా గందరగోళమే...అలాగే అందరూ ఏం చేయాలనేది ఎలాగూ అనుభవం మీద తెలుసుకుంటారు.

అందుకనీ...ఎవరినీ ఎక్కడికి వెళ్తున్నావని అడక్కండి.